ఏపీ రైతులకు అలర్ట్‌.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

ఏపీ రైతులు పంటల బీమా పరిహారం పొందలంటే బీమా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

By అంజి  Published on  25 Oct 2024 5:03 AM GMT
AP farmers, Agriculture department, crop insurance, compensation

ఏపీ రైతులకు అలర్ట్‌.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

ఏపీ రైతులు పంటల బీమా పరిహారం పొందలంటే బీమా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు పరిహారం అందుకోవాలంటే పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2019 ముందు ఉన్న పంటల బీమా విధానాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు సవరించిన వాతావరణ ఆధారిత బీమా స్కీమ్‌లపై రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలె క్టర్లకు వ్యవసాయ శాఖ సూచించింది. పంటల వారీగా నిర్ణయించిన బీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

రబీ సీజన్‌లో పంటల బీమా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, వ్యవసాయ ప్రణాళిక అధికారులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, లీడ్‌ బ్యాంక్ మేనేజర్లు, కామన్ సర్వీస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయ లోన్లు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించవచ్చు. పంటల వివరాలను నేషనల్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. జీడిమామిడికి నవంబరు 15వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించా లని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

Next Story