ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. తగ్గిన ధరలు నిన్నటి(ఆదివారం) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మందుబాబులు ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తుండడంతో మందుబాబులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. కొందరు అయితే.. మద్యం ధరలు తగ్గించడాన్ని ఓ పండుగలా జరుపుకుంటున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆదివారం మద్యం దుకాణాల వద్ద ఏకంగా పూజలు నిర్వహించారు.
దుకాణానికి హారతులు ఇచ్చి.. కల కానిది నిజమైనది అంటూ పాటలు కూడా పాడారు. కొబ్బరికాయలు కొట్టిన తరువాతనే మద్యాన్ని కొనుగోలు చేశారు. మందుబాబులు ఇలా చేయడాన్ని చూసిన స్థానికులు పగలబడి నవ్వుకున్నారు. అయినప్పటికీ ఇదంతా తమకు పట్టదన్నట్లుగా మందుబాబులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
నిన్నటి నుంచి రాష్ట్రంలో మద్యం ధరల్ని బట్టి 15 నుంచి 20 శాతం తగ్గాయి. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ. 20 నుంచి రూ. 50 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ. 120 నుంచి రూ. 200 వరకు తగ్గింది. అలాగే అన్ని రకాల బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకూ తగ్గాయి.