చాలా రాష్ట్రాల్లో విద్యను బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే!! హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షల్లో డబ్బులను లాగేసుకుంటూ ఉన్నాయి. ఎల్.కే.జీ. విద్యకే లక్షలు లక్షలు దోచేసుకుంటూ ఉంటే.. ఇక ఇంజనీరింగ్ లలో ప్రవేశాలకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఏ స్థాయిలో డబ్బులు గుంజేస్తూ ఉన్నాయో మన ఊహకే వదిలేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ల కోసం పెద్ద మొత్తంలో డొనేషన్ వసూలు చేస్తున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) డిమాండ్ చేస్తోంది.
అధిక ఫీజులు, డొనేషన్లు వసూలు చేసే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేవైఎం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కోరారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మహేందర్ ఆధ్వర్యంలో నాయకులు ప్రొ.లింబాద్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు, కోర్సుల ‘స్లైడింగ్’ పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. భారీ ఎత్తున డబ్బులు తీసుకుంటూ అడ్మిషన్స్ ఇస్తూ ఉండడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించి మెరిట్ లిస్ట్ ఆధారంగా వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టాలని మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజకీయపరంగా నియామకాలు చేసి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే బీజేవైఎం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతుందన్నారు.