కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా.. టీడీపీ కీలక నిర్ణయం
కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
By అంజి Published on 2 Jan 2025 1:05 PM IST
కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా.. టీడీపీ కీలక నిర్ణయం
అమరావతి: కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం.
''మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నేను, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది'' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
''ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా నేను బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చు చేసాం. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేసాం. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసాం. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నాం'' అని టీడీపీ నేత లోకేష్ తెలిపారు.