ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో అధికారులు కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.
అర్హులైనవారు కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రస్తుతం ఉన్న మార్పులు, చేర్పులు కూడా జరగనున్నాయి. ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28 వరకూ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు తరువాత స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. అంతా పూర్తయ్యాక సంక్రాంతి లోపే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.