చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. చట్టం అందరికీ సమానమేనన్న కోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి బిగ్ షాక్ తగిలింది.
By అంజి Published on 22 Sept 2023 11:17 AM ISTచంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. చట్టం అందరికీ సమానమేనన్న కోర్టు
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 24 వరకు రిమాండ్ గడువును పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. రిమాండ్ టైం ముగియడంతో చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌కు తీసుకురాగా.. కస్టడీపై చంద్రబాబు ఓపినియన్‌ని జడ్జి కోరారు. తనను జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని కోరారు.
విచారణ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని చంద్రబాబుకు తెలిపారు. మీకు విధించిన రిమాండ్‌ను శిక్షగా భావించొద్దని చెప్పారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్నీ తేలుతాయని అన్నారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. అలాగే జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న ఫెసిలిటీలపై పూర్తి వివరాలను ఇవ్వాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని జడ్జికి చంద్రబాబు తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ''నా వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారు. నా అరెస్ట్ అక్రమం. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన నాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. నా హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలి'' అని జడ్జిని కోరారు. చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నట్టు జడ్జి తెలిపారు. మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదననలు వినిపిస్తూ... చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.