ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా 1.83 కోట్ల మంది తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని యూఐడీఏఐ వెల్లడించింది. వీరిలో చిన్న వయసులో ఆధార్ పొంది 18 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా వేలిముద్రలు నమోదు చేసుకోవాల్సిన వారు 48.63 లక్షల మంది ఉన్నారంది. పదేళ్లలో ఒక్కసారైనా అడ్రస్, ఫొటోలను అప్డేట్ చేసుకోవాల్సిన వారు 1.35 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. వీరి కోసం ఈ నెల 20 నుంచి 24 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహించనుంది.
ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంప్‌లు నిర్వహించనుంది. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, 5 ఏళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్, ఆధార్ కార్డ్ పొంది పదేళ్లు పూర్తైన వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌తో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్పు వంటి సేవలను అందించనున్నట్టు పేర్కొంది.