తీరానికి పెనుముప్పు!

A threat to the coastal area of ​​AP.. INCOIS study revealed. ఆంధ్రప్రదేశ్ భూభాగం తగ్గనుందా? తీర ప్రాంతమంతా మునిగిపోనుందా? సముద్రం ముందుకు రానుందా?

By సునీల్  Published on  4 Aug 2022 5:07 PM IST
తీరానికి పెనుముప్పు!
  • కోస్తా తీరంలో 20 శాతం ప్రమాద జోన్‌లో
  • ఇన్‌కాయిస్ అధ్యయనంలో వెల్లడి

ఆంధ్రప్రదేశ్ భూభాగం తగ్గనుందా? తీర ప్రాంతమంతా మునిగిపోనుందా? సముద్రం ముందుకు రానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో ఏపీ కోస్తా తీరంలోని 20 శాతానికిపైగా ప్రాంతానికి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కాయిస్) ఏటా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో పరిశీలన జరుపుతుంది. ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో పరిస్థితులు, నీటి మట్టాలు, అలల్లో వస్తున్న మార్పులు, వాతావరణ స్థితిగతులను అధ్యయనం చేస్తుంది. ఈ సంస్థ తాజాగా కేంద్రానికి ఇచ్చిన నివేదికలో ఏపీ తీర ప్రాంతం పెనుముప్పును ఎదుర్కోనున్నట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏటా సముద్ర మట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలో హిమానీ నదాలు, మంచు పర్వతాలు కరగడం వల్ల వస్తున్న నీరంతా సముద్రాల్లో కలుస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఇలాంటి అనేక కారణాలతో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏపీకి సంబంధించి మొత్తంగా 20 శాతం తీర ప్రాంతానికి ముప్పు ఉంది. దీనిలో 43.35 శాతం తీరానికి అతి తక్కువ ముప్పు ఉంది. అంటే ఇప్పట్లో అక్కడ నివసించే వారికి ఎలాంటి భయం లేదు.

33.27 శాతం తీరానికి మాత్రం ఒక మాదిరి ముప్పు ఉంది. అంటే ఏ సమయంలోనైనా దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సమీప భవిష్యత్తులో అక్కడ నివసించే వారు తరలి పోవాల్సి ఉంటుంది. ఇంకా 0.55 శాతానికి మాత్రం అతి తీవ్ర ముప్పు ఉంది. ఇక్కడ ఉండే వారంతా అత్యవసరంగా ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరం ముందుకు చొచ్చుకు రావడంతో తీరం కోతకు గురైన విషయం అంతా చూశాం. అక్కడ ఆలయం, పలు నివాసాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అతి తీవ్ర ముప్పు ఉన్న ప్రదేశాలు ఇలాంటి ప్రమాదాన్నే ఎదుర్కోనున్నాయి.

పర్యావరణంలో జరిగే ఈ మార్పులను, అందువల్ల సంభవించే విపత్తులను మనం ఎదుర్కోలేం. అయితే ముప్పు తీవ్రత పెరగకుండా ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోగలవు. తీరప్రాంతాల్లో నివసించే వారికి ఇతర చోట్ల పునరావాసం కల్పించడం, డ్రెడ్జింగ్ ద్వారా సముద్ర మట్టాలు పెరగకుండా తాత్కాలికంగా చూడటం వంటివి చేయవచ్చు. అందుకోసం కేంద్ర జాతీయ విపత్తు ఉపశమన నిధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఐదేళ్ల కాలానికి రూ. 68 వేల 463 కోట్ల నిధులు అందించనుంది.

సహజంగా జరిగే కోతను మనం ఆపలేం.. కానీ కొంతవరకు నియంత్రించగలమని ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి తెలిపారు. ముందు కోతకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతాల్లో అధ్యయనం చేయాలన్నారు. కోతను నియంత్రించేందుకు సెండ్‌వాల్ ఫెన్సింగ్, సీ వాల్ ఫెన్సింగ్ నిర్మించాలని, కొన్ని దేశాల్లో ఈ తరహా విధానం ఉందని తెలిపారు.

అయితే ఒకచోట కోతను నియంత్రిస్తే.. ఆ ప్రభావం మరోచోట ఉంటుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

అభివృధ్ది పేరుతో తీర ప్రాంతాన్ని కాపాడే కొండలను తవ్వేయడం కోతకు కారణం అవుతోందని ప్రొ. రామారావు తెలిపారు. కొల్లేరు, కాకినాడ, కోరంగి, విశాఖ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో మడ అడవులను విచక్షణ లేకుండా నరికేయడం సముద్రం ముందుకు చొచ్చుకు రావడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ ప్రభావం తీర ప్రాంతాల మీదే కాకుండా మత్స్యకార గ్రామాలకు కూడా ముప్పు అవుతుందని వివరించారు.

Next Story