విజయవాడలో 'మంకీ పాక్స్‌' అనుమానిత కేసు కలకలం

A suspected case of monkeypox in Vijayawada. వైరల్ వ్యాధి మంకీపాక్స్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. భారత్‌లోని కేరళలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన విషయం

By అంజి  Published on  17 July 2022 9:37 AM GMT
విజయవాడలో మంకీ పాక్స్‌ అనుమానిత కేసు కలకలం

వైరల్ వ్యాధి మంకీపాక్స్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. భారత్‌లోని కేరళలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మంకీపాక్స్‌ కేసు కలకలం రేపింది. దుబాయి నుంచి వచ్చిన ఫ్యామిలీలోని ఓ చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉండటంతో మంకీపాక్స్‌ కేసుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి శాంపిల్స్‌ సేకరించిన వైద్యులు.. వాటిని పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఆ తర్వాత చిన్నారి ఫ్యామిలీని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మంకీపాక్స్‌ కేసుల పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్ వ్యాధి నివారణ కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. మంకీ పాక్స్‌ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని కోరింది. ఆరోగ్య అధికారులందరికీ క్రమం తప్పకుండా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది.

లక్షణాలు ఇవే

  • జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి.
  • ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి.
  • ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు.
  • కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Next Story