పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటు చేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అతివేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటికుంటపల్లె వద్ద బస్సు ప్రమాదం జరిగింది. రాయచోటి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ బస్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను ఢీకొట్టింది. ఆపై అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమృత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా స్కూల్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.