ఏపీలో దారుణం..పోలీసుల ఎదుటే వ్యక్తిని కొడవళ్లతో నరికి హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది

By -  Knakam Karthik
Published on : 5 Jan 2026 12:45 PM IST

Andrapradesh, Sri Sathya Sai District, Tanakal Police Station, Murder, Extramarital Affair

ఏపీలో దారుణం..పోలీసుల ఎదుటే వ్యక్తిని కొడవళ్లతో నరికి హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున రాగినేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిని అన్నదమ్ములు హరి, చెన్నప్ప కొడవళ్లతో నరికి చంపారు. వివరాల్లోకి వెళితే.. రాగినేపల్లికి చెందిన హరి భార్యతో మార్పురివాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

అయితే ఈ నెల 1న హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లాడు. దీంతో హరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో కారు నుంచి దిగి స్టేషన్‌లోకి వెళ్తుండగా ఈశ్వరప్పపై హరి, చెన్నప్ప దాడి చేశారు. కొడవళ్లతో నరికి ఘటనాస్థలంలోనే హతమార్చారు.

ఈ దారుణ ఘటనతో అక్కడ ఉన్న హరి భార్య భయపడి అక్కడి నుంచి పరారైంది. పోలీసులు నిందితులైన హరి, చెన్నప్పలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలో విస్తృత చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్ ముందే ఇలాంటి దారుణం జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story