Andrapradesh: సపోటా తోటలో బాలికపై అత్యాచారయత్నం..నిందితుడిపై పోక్సో కేసు

కాకినాడ జిల్లా తునిలో ఓ గురుకుల పాఠశాల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By -  Knakam Karthik
Published on : 22 Oct 2025 4:00 PM IST

Andrapradesh,  Kakinada district, Tuni, Man Attempted To Rape, school girl

Andrapradesh: సపోటా తోటలో బాలికపై అత్యాచారయత్నం..నిందితుడిపై పోక్సో కేసు

కాకినాడ జిల్లా తునిలో ఓ గురుకుల పాఠశాల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని నిలదీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. తుని రూరల్‌లోని ఓ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను, స్థానిక టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను సమీపంలోని హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమయంలో బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాలికను అతని చెర నుంచి కాపాడారు.

ఈ ఘటనపై స్థానికులు నారాయణరావును గట్టిగా నిలదీయగా, బాలిక మూత్ర విసర్జన కోసం ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో "నేనెవరో తెలుసా? నేను టీడీపీ కౌన్సిలర్‌ను. నన్నే ప్రశ్నిస్తారా? తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ వారిని బెదిరించారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

షాక్‌కు గురయ్యా: లోకేశ్

తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్ కు గురయ్యాను...అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తాం. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తాం. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది...అని లోకేశ్ రాసుకొచ్చారు.

Next Story