వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు టెక్కలిలో ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. మే 21వ తేదీ నాడు టెక్కలి మండల పరిధిలోని చిన్నానారాయణపురానికి చెందిన 12 ఏళ్ల వినీత్ ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. ముల్లు గుచ్చుకుందని మొదట భావించారు. అయితే ఆ కాసేపటికే వినీత్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు ముల్లు గుచ్చుకుందని రెండు గంటల పాటు వదిలేశారని, పరిస్థితి విషమించాక శ్రీకాకుళం తీసుకెళ్తుండగా బాబు చనిపోయాడని తల్లిదండ్రులు చెప్పారు.
ఈ క్రమంలోనే తీవ్ర ఆవేదన చెందిన మృతుడి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాము కాటుకు, ముల్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని డాక్టర్లకు వందనాలు అంటూ జిల్లా ఆస్పత్రికి వెళ్లే కూడలిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు అని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డ మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ కమిషనర్‌ను అందులో వేడుకున్నారు.