ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బైక్ షోరూం హార్డ్‌వేర్ షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హార్డ్‌వేర్ షాప్, వైన్ షాప్‌లకు కూడా మంటలు వ్యాపించాయి. పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని భగవతి రోడ్డులోని బైక్ షోరూం హార్డ్‌వేర్ షాపులో ఈ ఘటన జరిగింది. ఇవాళ తెల్లవారుజామున షోరూం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే.. ఆ షాపు యజమానులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, స్థానికులు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మంటలను అదుపు చేశారు. పాతవి, కొత్తవి కలిసి సుమారు 90కిపైగా బైక్‌లు అగ్గిపాలయ్యాయని యజమానులు తెలిపారు.
షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లకు చార్జింగ్ పెట్టారని, అయితే ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని సమాచారం. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలోని నాచారం పీఎస్ పరిధిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.