అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేట మండలంలోని ఇసుకపల్లి పరిసరాల్లోని తోటల నుంచి మామిడికాయలు కోయడానికి రైల్వేకోడూరు, వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన 21 మంది కూలీలు ఆదివారం నాడు వచ్చారు. ఈ క్రమంలోనే మామిడి కాయలతో లోడుతో రైల్వేకోడూరు మార్కెట్‌కు వెళ్తున్న లారీపై వీరంతా కూర్చున్నారు.
లారీ పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లి చెరువు కట్ట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహాయక బృందాలు మరియు పోలీసు సిబ్బంది రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.