72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ పెరేడ్ పరిశీలించేందుకు పుష్పాలంకృతమైన ప్రత్యేక వాహనంలో పోలీసు పెరేడ్‌ను రాష్ట్ర గవర్నర్ పరిశీలించారు.
తొలుత పోలీసు కవాతుల ప్రదర్శనలో భాగంగా ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్ కమాండెంట్ సుబేదార్ ముఖేష్‌కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పోలీసు కవాతు ప్రదర్శించారు. అనంతరం పైప్‌లైన్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరి స్పెషల్ పోలీస్ పైప్ బ్యాండ్ టి.పాండురంగారావు, స్కాట్‌లాండ్ పైప్‌లైన్ బ్యాండ్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు గణతంత్య్ర దినోత్సవం కవాతు ప్రదర్శనలలో పాల్గొన్నారు.
తొలుత సభా ప్రాంగణానికి డీజీపీ చేరుకున్నారు. అనంతరం పెరేడ్ నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందన స్వీకరించారు. తదుపరి సభా ప్రాంగణానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్ చేరుకున్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులు స్వాగతం పలికారు.