700 మంది మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
700 Maoist sympathizers surrendered before the police and BSF. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్న తరుణంలో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 700 మంది
By అంజి Published on 18 Sept 2022 2:04 PM ISTతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్న తరుణంలో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోవడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 700 మంది క్రియాశీల మావోయిస్టు మద్దతుదారులు శనివారం మలకన్‌గిరి జిల్లాలో పోలీసులు, బీఎస్‌ఎఫ్ ఎదుట లొంగిపోయినట్లు ఒక అధికారి తెలిపారు. వీరిలో 300 మంది మిలీషియా సభ్యులు కూడా ఉండటం గమనార్హం. లొంగిపోయిన తర్వాత మావోయిస్టులు ఇచ్చిన దుస్తులను తగులబెట్టి మావోయిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మావోయిస్టుల వేషధారణలను, సాహిత్యాన్ని తగులబెట్టి, మావోబడి ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ స్థానిక ప్రజలు, మీడియా ముందు మావోయిస్టు భావజాలాన్ని వ్యతిరేకించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడల్‌పుట్, కుసుంపుట్, మటంపుట్, జోడిగుమ్మ గ్రామాల మిలీషియా సభ్యులతో పాటు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా భజగూడ, బైసెగూడ, ఖల్‌గూడ, పాత్రపుట్, వందేపదర్, సంబల్‌పూర్, సింధిపుట్ గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు లొంగిపోయారు.
ఈ గ్రామాలన్నీ ఒడిశా-ఏపీ సరిహద్దులో ఉన్నందున గతంలో మావోయిస్టులకు కంచుకోటగా ఉండేవి. ఈ మావోయిస్టు మద్దతుదారులు హింసాత్మక కార్యకలాపాలకు సహకరించేవారు, భద్రతా బలగాలు, పౌరులను చంపడంలో పాలుపంచుకున్నారని, వారికి లాజిస్టిక్స్ సరఫరా చేయడానికి కూడా ఉపయోగించారని అధికారి తెలిపారు. కోరాపుట్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన్‌లాల్, మల్కన్‌గిరి ఎస్పీ నితేశ్ వాధ్వానీ, 65వ బెటాలియన్ సీఓ టీఎస్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు. ఏఓబీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జీవన స్రవంతిలోకి వచ్చామన్నారు.
బీఎస్‌ఎఫ్ డీఐజీ మదన్ లాల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, భద్రతా బలగాల వ్యూహాత్మక మోహరింపు గ్రామస్తులను ప్రధాన స్రవంతిలో చేరడానికి ప్రేరేపించాయని అన్నారు. కొత్త రోడ్లు, వంతెనలు, వైద్య సదుపాయాలు, మొబైల్ టవర్ల ఏర్పాటు, తాగునీరు, అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా వంటి వరుస అభివృద్ధి పనుల ప్రభావం మావోయిస్టులకు గతంలో మద్దతుగా ఉన్న ప్రజలపై పడిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మల్కన్‌గిరి జిల్లాలో ఇప్పటివరకు 1,647 మంది మావోయిస్టు మద్దతుదారులు, మిలీషియా పోలీసులు, బీఎస్‌ఎఫ్ ముందు లొంగిపోయారు.