ఏపీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను రామాంజనేయులు (60) అనే వ్యక్తి బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
By అంజి
ఏపీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను రామాంజనేయులు (60) అనే వ్యక్తి బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో బెదిరించి ఇంటి బయటే తాళి కట్టి కాపురానికి తీసుకెళ్లాడు. వారం రోజుల్లోనే బాలిక పుట్టింటికి రాగా.. తల్లిదండ్రలపై దాడి చేసి మళ్లీ ఎత్తుకెళ్లాడు. రెండు రోజులు బాలికను హింసించాడు. బాధితురాలు తప్పించుకుని ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దంపతులిద్దరు కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురుకు పెళ్లి చేయగా భర్త చనిపోవడంతో పుట్టింట్లోనే ఉంటోంది. ఒక రెండో కూతురు.. మైనర్. ఈ క్రమంలోనే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆసరగా చేసుకున్న గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆ బాలికను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. రామాంజనేయులు భార్య రెండేళ్ల కిందట చనిపోయింది. అతనికి పెళ్లైన కుమారుడు, పెళ్లి కావాల్సిన కుమార్తె ఉన్నారు.
రెండో పెళ్లి చేసుకోవాలని గత నెలలో బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. అయితే తల్లిదండ్రులు అందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే వారిని బెదిరించి ఇంటి బయటే బాలికకు తాళి కట్టాడు. బాలికను బలవంతంగా కాపురానికి తీసుకెళ్లాడు. వారం రోజుల తర్వాత బాలిక పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత రామాంజనేయులు తన బంధువులతో కలిసి బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులపై దాడి చేశాడు. బాలికను బలవంతంగా మళ్లీ ఎత్తుకెళ్లాడు. చిత్రహింసలు పెట్టాడు. బాధితురాలు ఆదివారం నాడు రాత్రి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోమవారం నాడు ఉదయం స్థానికుల సాయంతో అనంతపురం ఎస్సీ కార్యాలయానికి చేరకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.