దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

దేశ వ్యాప్తంగా దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్‌లో తేలింది.

By అంజి
Published on : 18 March 2025 11:13 AM IST

MLAs, criminal cases, Andhra Pradesh, ADR Report

దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు చెందిన 4,092 మంది ఎమ్మెల్యేలను విశ్లేషించినప్పుడు, దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్‌లో తేలింది. వారిలో 1,205 మంది అంటే 29% మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ , మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR).. 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను విశ్లేషించింది. క్రిమినల్ కేసులు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక శాతం 79% (174 లో 138) గా ఉంది. తరువాత కేరళ, తెలంగాణ 69% చొప్పున, బీహార్ (66%), మహారాష్ట్ర (65%), తమిళనాడు (59%) ఉన్నాయి.

తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 56% (98%) తో అగ్రస్థానంలో ఉంది, తరువాత తెలంగాణ (50%) , బీహార్ (49%) ఉన్నాయి.

పార్టీల వారీగా విశ్లేషణ ప్రకారం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 86% (134 మంది శాసనసభ్యులలో 115) ఉన్నారు. అంతేకాకుండా, 61% లేదా 82 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బిజెపి ఎమ్మెల్యేలలో దాదాపు 39% (1,653 మందిలో 638) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 436 మంది లేదా 26% మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని విశ్లేషణలో తేలింది. 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో (52%) 339 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 194 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని విశ్లేషణలో తేలింది.

తమిళనాడు అధికార డీఎంకే ఎమ్మెల్యేలలో 74 శాతం (132 మందిలో 98 మంది) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి, వీరిలో 42 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో దాదాపు 41% (230 మందిలో 95 మంది) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 78 లేదా 34% మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఢిల్లీలో అధికారం నుండి తొలగించబడిన ఆప్ పార్టీలోని 123 మంది ఎమ్మెల్యేలలో 69 మంది (56%) క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో 35 మంది (28 శాతం) మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

54 మంది ఎమ్మెల్యేలు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, 226 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అదనంగా, 127 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు, వీరిలో 13 మంది ఎమ్మెల్యేలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నివేదిక ఎమ్మెల్యేల ఆర్థిక నేపథ్యాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. 119 మంది ఎమ్మెల్యేలు (3%) బిలియనీర్లు. అన్ని రాష్ట్ర అసెంబ్లీలలో సగటున ఎమ్మెల్యేల ఆస్తులు రూ.17.92 కోట్లు. అయితే, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.20.97 కోట్లుగా ఉన్నాయి.

Next Story