భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎటు చూసినా వరద నీరే దర్శనం ఇస్తోంది. పలు చోట్ల వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోతుంది. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పులపత్తూరు, శేషమాంబపురం, గుండ్లూరు, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది ప్రవాహంలో ఇప్పటి వరకు 30 మంది కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చేపట్టగా.. మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి.
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురిని జేసీబీ సాయంతో స్థానికులు కాపాడారు. కారులో ఉన్నవారిని జేసీబీపైకి ఎక్కించారు. అయితే.. తరువాత జేసీబీ వరద నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో కాపాడడానికి వెళ్లిన నలుగురితో పాటు కారులోని నలుగురు మొత్తం ఎనిమిది మంది జేసీబీ పైన నిల్కొచి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రవాహంలోకి వెళ్లి రక్షించే అవకాశం లేకపోవడంతో హెలికాఫ్టర్ సాయం కోసం ఎదురుచేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.