Kurnool bus accident: వంద‌ల సంఖ్య‌లో సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేల‌డం వ‌ల్లే భారీగా మంట‌లు..!

కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి

By -  Knakam Karthik
Published on : 25 Oct 2025 10:12 AM IST

Andrapradesh, Kurnool bus accident, Bus Fire, Vemuri Kaveri Travels

Kurnool bus accident: వంద‌ల సంఖ్య‌లో సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేల‌డం వ‌ల్లే భారీగా మంట‌లు..!

కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 400 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు అవి సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు.

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ పి. వెంకటరమణ వివరాలు వెల్లడించారు. బస్సు లగేజ్‌ విభాగంలో ఉంచిన కొత్త మొబైల్‌ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని ఆయన చెప్పారు. ఈ హ్యాండ్‌సెట్లు బెంగళూరులోని ఓ కస్టమర్‌కు పంపించడానికి ఉంచి ఉండవచ్చని తెలిపారు. మొబైల్‌ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్‌ బ్యాటరీలు కూడా పేలిపోయాయని ఆయన వివరించారు. మంటల తీవ్రత వల్ల బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని చెప్పారు.

పెట్రోలు పడి మంటలు...

కరిగిపోయిన షీట్ల కింద నుంచి ఎముకలు, బూడిద కిందపడటం చూశామని వెంకటరమణ తెలిపారు. ఇంధన లీకేజీ కారణంగా ముందు భాగంలో మంటలు అంటుకున్నాయని ఆయన వివరించారు. ఎదురుగా వచ్చిన బైక్‌ బస్సు కింద ఇరుక్కుపోవడంతో దాని నుంచి చిందిన పెట్రోలు తాకిడికి వేడితో లేదా స్పార్క్‌తో మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుందని తెలిపారు. బస్సు తయారీలో ఇనుము బదులు తేలికపాటి అల్యూమినియం వాడటం వలన వాహనం బరువు తగ్గి వేగం పెరుగుతుందని, అయితే అగ్నిప్రమాద సమయంలో ఆ లోపం ప్రమాదాన్ని మరింత పెంచిందని ఆయన చెప్పారు.

Next Story