దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆతరువాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే.. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరిని కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో శానిటైజేషన్‌ను చేపట్టారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 35,196 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 758 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అత్యధికంగా చిత్తూరులో 175 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,879కి చేరింది. నిన్న ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య 7,201కి చేరింది.
ఇక ఒక్కరోజులో 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8,85,209కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,48,75,597 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.