యానాం చేపల మార్కెట్‌లో నిర్వహించిన వేలంలో పులస చేప రికార్డ్ ధర పలికింది. రెండు కిలోల బరువు ఉన్న పులస చేపను రూ.19 వేలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. స్థానికంగా చేపల వేలం పాట జరిగింది. ఈ క్రమంలోనే పులస చేప రికార్డ్ ధర పలికింది. నాటి పార్వతి అనే మహిళ.. పులస చేపను భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు అమ్మింది. ఈ సీజన్‌లో నిర్వహించిన వేలంలో ఇదే అధిక ధర అని స్థానికులు చెబుతున్నారు. గత సంవత్సరం ఇక్కడ దొరికిన పులస ధర రూ.25 వేలు పలికింది.
ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ దగ్గర ఇసుక మేటల వేశాయి. దీంతో సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వర్షాకాలం మొదట్లో పులస చేపలు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. దీంతో పులసను సొంతం చేసుకునేందుకు జనాలు పోటీపడుతున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో పులస చేపలు ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గర పులసలు ఎక్కువగా దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.
గోదావరి జిల్లాల్లో 'పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి' అని నానుడి ఉంది. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. దీంతో ఎంత ధరైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు. ఈ చేప జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వశిష్ట గోదావరి, గోదావరి నదులలో కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో ఈ పులసలను 'చేపల రాణి' అని పిలుస్తుంటారు. ఏపీలో స్థానికంగా పులసగా పిలవబడే ఈ చేప రకానికి భారీ డిమాండ్ ఉంది.