ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో బోగీలు పట్టాలు తప్పడంతో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు.

By అంజి  Published on  30 Oct 2023 1:02 AM GMT
trains collision, Vizianagaram, APnews,Passenger trains, East Central Railway

ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో బోగీలు పట్టాలు తప్పడంతో 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే గాయపడిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉందని ఘటనా స్థలిలోని పరిస్థితులు చెబుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కొత్తవలస మండలం కంటకాపల్లి - అలమండ మధ్య ఈ ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు నంబర్ (08504).. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు (08532)ను ఢీకొంది. ఢీకొనడంతో విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు వెనుక రెండు కోచ్‌లు, విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఇంజన్ పట్టాలు తప్పాయి. మూడు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. "విజయనగరం నుండి రాయగడకు ప్రయాణీకులతో పాటు ప్రయాణిస్తున్న రైలు విశాఖపట్నం నుండి పలాసకు అదే మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయని" తూర్పు మధ్య రైల్వే CPRO తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, విశాఖపట్నం-రాయగడ రైలు సిగ్నల్ ఓవర్‌షూట్ చేయడం వల్ల ఢీకొనడానికి మానవ తప్పిదమే కారణమని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం ఎక్స్‌(గతంలో ట్విట్టర్)లో.. "అలమండ - కంటకపల్లె సెక్షన్ మధ్య దురదృష్టవశాత్తు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు" అని పేర్కొంది. "బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు" అని ఎక్స్ పోస్ట్ పేర్కొంది.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, విశాఖపట్నం, సమీప విజయనగరం జిల్లాల నుంచి వీలైనంత ఎక్కువ అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. సత్వర సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని రైల్వే అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అందరినీ రక్షించామని, బృందాలను సమీకరించామని చెప్పారు. "పీఎం మోడీ పరిస్థితిని సమీక్షించారు. నేను ఆంధ్రప్రదేశ్ సీఎంతో మాట్లాడాను. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని రైల్వే మంత్రి తెలిపారు. రైలు పట్టాలు తప్పిన కారణంగా మరణించిన ప్రతి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు.

యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, ఇతర రెస్క్యూ పరికరాలు పంపించబడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి

విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి కోసం. మరణించి ఇతర రాష్ట్రాలకు చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందజేయనున్నారు. తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులకు రూ.50,000 చొప్పున అందజేయనున్నారు.

జూన్ 2న బాలాసోర్‌లోని బహనాగ బజార్ స్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ స్థిరంగా ఉన్న సరుకు రవాణా రైలును ఢీకొట్టిన తర్వాత భారీ ప్రమాదం జరిగిన నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు.

Next Story