విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెండి ప్రతిమలు దొంగతనం తరువాత అధికారులు దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలపై కూడా దృష్టి సారించారు. గత మూడు రోజులుగా ఏసీబీ అధికారులు దుర్గగుడిలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో అనేక అవినీతి విషయాలు వెలుగు చూశాయి. ఈ దాడుల్లో అధికారులు పలు కీలక పత్రాలను, అవినీతి ఆధారాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా భారీ అక్రమాలు జరిగినట్టు నిర్థారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అన్నదానం, టిక్కెట్ల అమ్మకాలు, చీరల విభాగంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విభాగం, చీరలు, ఫోటోల విభాగంలో పనిచేస్తున్న ఐదుగురు సూపరెంటెండెంట్లు, 8 మంది సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేశారు.