ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు

అత్యవసర వైద్య సేవల కోసం 24 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయి.

By -  Knakam Karthik
Published on : 18 Nov 2025 5:20 PM IST

Andrapradesh, Government Hospitals, 13 critical care blocks , Health Department

ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు

అమరావతి: అత్యవసర వైద్య సేవల కోసం 24 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయి. వచ్చే నెలాఖరు నాటికి 13, 2026 ఆగస్టు నాటికి మరో 11 సీసీబీలను వినియోగంలోనికి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. వీటి ద్వారా అదనంగా 1,275 పడకలు అందుబాటులోనికి వస్తాయి వీటి నిర్మాణాల పురోగతిని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫాస్ట్రక్చర్ మిషన్ (పీఎం అభీమ్) కింద రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన వీటి నిర్మాణాలను దశల వారీగా వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తిచేయాలని అదికారులను మంత్రి ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

బోధనాసుపత్రుల నుంచి ఏరియా ఆసుపత్రుల వరకు..!

కోవిడ్-19 సమయంలో అత్యవసర వైద్యం రోగులకు అందడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో నాన్-కొవిడ్ కేసుల వారికి సరైన వైద్యం అందలేదు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పనరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 621 సీసీబీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గుంటూరు మినహా 16 బోధనాసుపత్రులు, తెనాలి, అనకాపల్లి, హిందూపురం జిల్లా అసుపత్రులు (3), నరసరావుపేట, పాలకొండ, భీమవరం, రాయచోటి, చీరాల ఏరియా (5) ఏరియా ఆసుపత్రుల్లో వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఆగస్టు నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికలు!

ప్రస్తుతానికి నెల్లూరు, ఒంగోలు బోధనాసుపత్రుల్లోని సీసీబీల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరు నాటికి కడప, కర్నూలు, తిరుపతి, హిందూపురం, అనంతపురం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, విశాఖ, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం, 2026 మార్చి నాటికి తెనాలి జిల్లా ఆసుపత్రి, ఆగస్టు నాటికి చీరాల, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, పాలకొండ, నంధ్యాల, భీమవరం, నరసరావుపేట, రాయచోటి, కాకినాడ ఆసుపత్రుల్లో నిర్మాణాలు పూర్తవుతాయి.

ఒక్కో 50 పడకల సీసీబీ కోసం రూ.23.75 కోట్లు వ్యయం!

50 పడకలతో ఏర్పాటయ్యే 22 సీసీబీల్లో ఒక్కొక్క దానికి (పరికరాలు/యంత్రాలతో కలిపి) రూ.23.75 కోట్లు చొప్పున వ్యయంచేస్తున్నారు. 75 పడకలతో ఉన్న నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో సీసీబీ నిర్మాణానికి రూ.36.35 కోట్లు, వంద పడకలతో తెనాలి జిల్లా ఆసుపత్రిలో రూ.44.50 కోట్లతో సీసీబీ ఏర్పాటు కాబోతుంది. ప్రతి ఆసుపత్రిలో సుమారు రూ.7 కోట్లను పరికరాలు/ యంత్రాల కోసం వ్యయం చేస్తున్నారు.

ఐసీయూ, మినీ ఐసీయూ, ఇతర సౌకర్యాలు

ప్రతి 50 పడకల సీసీబీలో..పది పడకలతో ఒక ఐసీయూ, ఆరు పడకలతో మినీ ఐసీయూ (స్టెప్ డౌన్), 24 ఐసోలేషన్ పడకలతో పాటు విడిగా డయాలసిస్ పడకలు, మెటర్నటీ పడకలు, క్యాజువాల్టీ వార్డు అందుబాటులోనికి వస్తుంది. గుండె, శ్వాసకోశ సంబంధిత కేసులు, పాయిజన్ కేసులు, డయాలసిస్, మెటర్నల్ అoడ్ వైల్డ్ హెల్త్ ఇతర కేసులు ఇక్కడ చూస్తారు.

Next Story