ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నాడు టూరిస్ట్ బస్సు కొండ రహదారిపై నుండి పడిపోవడంతో కనీసం పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా వనజంగిలో చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైందని ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అదే సమయంలో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని కందఘాట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. యాపిల్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడింది. లారీ పలు పల్టీలు కొడుతూ లోయలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ బరువుతో ఉండటం, అనేక పల్టీలు కొట్టడం కారణంగా క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.