అమరావతి: ఆర్టికల్‌ 360 కింద ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడమే కాకుండా రెవెన్యూ వ్యయం పెరిగిందని, మూల ధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గిందన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వడమే కష్టంగా మారిందని యనమల పేర్కొన్నారు. జాతికి, రాష్ట్రానికి సరిదిద్దలేని అన్యాయం చేశారన్నారు. రాజకీయ సంక్షోభంలో వైసీపీ చిక్కుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఆర్థిక అస్థిరత నెలకొందని, క్రెడిట్‌ అవకశాలు నీరుగారిపోయాయని యనమల అన్నారు. తక్షణమే రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని యనమల డిమాండ్‌ చేశారు. వైసీపీ నేతలు భూకబ్జాలు, ఇసుక దందాలు, మద్యం మాఫియాలో తలమునకలయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రక్షించడం వైసీపీ నేలకు ఎటూ చేతకాదని.. అందుకే ప్రజలే రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే నినాదం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలని యనమల అన్నారు.

Andhra pradesh

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం వైసీపీ ప్రభుత్వానికి లేదని యనమల చెప్పుకొచ్చారు. మొన్న ఇసుక ఆందోళనలు, నిన్న గిట్టుబాటు ధరలు కోసం ఆందోళనలు అంటూ రాష్ట్రంలో పెట్టుబడుల వ్యతిరేక వాతావరణం సృష్టించారని యనమల ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలను పొగొట్టారని, సంపద సృష్టి అవకాశాలన్నీ మూతపడ్డాయన్నారు.

వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందని, టీడీపీ ప్రభుత్వ పథకాలను రద్దు చేశారని యనమల అన్నారు. మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు కోతలు పెట్టారన్నారు. ఇలాగైతే భవిష్యత్తులో కూడా ఆదాయం పెరగదన్నారు. రివర్స్‌ టెండర్ల పేరుతో అభివృద్ధిని రివర్స్‌ చేశారని, దానితో పేదల సంక్షేమం కూడా రివర్స్‌ అయ్యిందని యనమల వ్యాఖ్యనించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశానన్న పిచ్చి ఆనందమే ఆయనకు మిగిలిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35,260 కోట్లు ఉంటే, ఎనిమిది నెలల్లోనే రూ.35 వేల కోట్లు అప్పులు చేశారని, రాబోయే నాలుగు నెలల్లో ఇంకెత అప్పు చేస్తారో తెలియని దుస్థితి నెలకొందని యనమల రామకృష్ణుడు అన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.