ఆయనకు కీలక పదవీ ఇవ్వనున్న జగన్..!
By సుభాష్
ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ కోసం ఎన్నికల సమయంలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా తమ టికెట్లను సైతం త్యాగం చేసి, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు పదవులు ఇస్తానని, ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు జగన్. ఆ హామీ మేరకు అందరికి న్యాయం జరిగేలా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి తప్పుకొని కిలారు రోశయ్యకు లైన్ క్లియర్ చేసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణకు జగన్ త్వరలోనే పదవి ఇచ్చేందుకు జగన్ సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.
అప్పట్లో రికార్డు సృష్టించి వెంకరమణ:
రావి వెంకటరమణకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. 2004 ఎన్నికల్లో ఆయన ప్రత్తిపాడు నుంచి పోటీ , మాకినేనిని ఓడించి రికార్డు సృష్టించారు. 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఆయనకు సీటు దక్కలేదు. అలాంటి నాయకుడు తర్వాత వైఎస్ మరణం, తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆయన తన రాజయాలను వైసీపీతో మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే 2014లో పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఈ ఏడాది ఎన్నికలకు ముందు వరకు పొన్నూరు ఇన్‌చార్జ్‌గానే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు.
ఎన్నికల ముందు అనూహ్యంగా మారిపోయిన రాజకీయాలు:
ఎన్నికలకు 20 రోజుల ముందు అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి. అప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు గుంటూరు లోక్‌సభ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కిలారు రోశయ్యను పొన్నూరు కు పంపాల్సి వచ్చింది. ఇక్కడ రోశయ్య మామ అయిన వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రాంగం కూడా బాగానే పని చేసిందనే చెప్పాలి. దీంతో ఎన్నికలకు దాదాపు నెల రోజు ల ముందు వరకు కూడా ఇంచార్జ్‌గా ఉన్న రావి వెంకట రమణ తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, పార్టీ కోసం ఆయన భేషజాలకు పోకుండా కూడా పనిచేశారు.
నామినేటెడ్ పదవి..
ఈ నేపథ్యంలో రావి వెంకటరమణ చేసిన త్యాగానికి ప్రతిగా జగన్ ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోన్న చర్చల ప్రకారం రావి వెంకటరమణకు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రత్తిపాడు, పొన్నూరు రెండు నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా ఆయన ఎక్కడ జడ్పీటీసీగా పోటీ చేసినా సులువుగానే విజయం సాధిస్తారు. జిల్లా వైసీపీ నేతలందరితోనూ సఖ్యతతో ఉండే రావి వెంకట రమణకు మెజార్టీ ప్రజాప్రతినిధులు కూడా సపోర్ట్‌గా ఉంటున్నారు. జడ్పీ చైర్మన్ ఓసీలకు రిజర్వ్ కాని పక్షంలో మరో నామినేటెడ్ పదవి అయినా రావి వెంకట రమణకు దక్కే ఛాన్సులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.