1958 నుండి 'మండలి' మతలబ్ ఇదే
By సుభాష్ Published on 27 Jan 2020 9:13 PM ISTఏపీలో శాసన మండలి రద్దు అయింది. మండలి రద్దుకు ఓటింగ్ నిర్వహించగా, 133 మంది అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఇక పార్లమెంట్ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది.
కాగా, ఏపీ శాసన మండలి భారతదేశంలోని శాసన వ్యవస్థలో ఎగువ సభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్ 1958 నుంచి 1985, 2007 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తర్వాత విడివిడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉండగా, ముగ్గురి రాజీనామాతో ఆ సంఖ్య 55 మందికి చేరింది.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏపీ రాష్ట్రం ఒకే పార్లమెంటరీ వ్యవస్థలో పని చేసింది. 1956 డిసెంబర్ 5వ తేదీన ఏపీ సభ శాసన మండలి ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసింది. అధికారికంగా శాసన మండలి 1958 జూలై 1న ప్రారంభమైంది. భారత రాజ్యాంగంలో 168 అధికరణం మూలంగా జరిగింది. 1968 జులై 8వ తేదీన అప్పటి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ మండలిని ప్రారంభోత్సవం చేశారు. అలా మొదలైన మండలి 1985లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం, ఏపీ శాసన మండలి చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌కు పంపింది. ఆ తర్వాత రెండేళ్లకు పార్లమెంట్‌లో ఆమోదం పొంది ఏపీ శాసన మండలి రద్దయింది.
1989లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం మర్రి చెన్నారెడ్డిలో శాసన మండలి పునరుద్దరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మండలిని పునరుద్దరించడానికి 1990 జనవరి 22న అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆమోదించారు. వారు పంపిన తీర్మానాన్ని పార్లమెంట్ పట్టించుకోలేదు. దాంతో ఆ తీర్మానం అప్పటి అసెంబ్లీ వరకే పరిమితమైంది.
మరలా ఆ తర్వాత 2004 కేంద్ర, రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ఏపీ శాసనసభ 2004, జులై 8 శాసన మండలి పునరుద్దరణకు ఏపీ శాసన సభలో మరోసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని 2004, డిసెంబర్ 15వ తేదీన ఏపీ కౌన్సిల్ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని 2006, డిసెంబర్ 15న లోక్ సభ ఆమోదించింది.
ఇక ఆ బిల్లు డిసెంబర్ 20వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది. అనంతరం 2007, జనవరి 10న రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడంతో 2007, మార్చి30న ఏపీ శాసన మండలి ఏర్పాటైంది. ఏప్రిల్ 2వ తేదీన అప్పటి ఏపీ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ మండలిని ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత మరోసారి శాసన మండలిని రద్దు చేస్తూ వైస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్లమెంట్ ఉభయ సభలు ఎప్పుడు స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.