'గన్' కంటే ముందు జ'గన్' : ఎమ్మెల్యే రోజా
By సుభాష్ Published on 9 Dec 2019 9:24 PM ISTఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వాడి-వేడీగా చర్చ జరిగింది. మహిళకు భద్రత అంశంపై సభలో చర్చకు సిద్ధం కాగా, ఉల్లి ధరలపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. సభలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్ మండిపడ్డారు. ఇక చర్చలో ఎమ్మెల్యే రోజు మాట్లాడారు. టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ గా చేసింది.
మహిళలంటే టీడీపీ నేతలకు చులకన భావం అని, కాల్ మనీ రాకెట్‌లో టీడీపీ నేతల పేర్లు ఎక్కడ బట్టబయలు అవుతాయోననే భయం పుట్టుకుందన్నారు. లోకేష్ ఫోటోలు, బాలయ్య మహిళలపై వ్యాఖ్యలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈ చర్చను అడ్డుపడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చను అడ్డుకున్నవారు అన్నం తింటున్నారా.. లేక గడ్డి తింటున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పప్పులో ఉల్లిపాయ లేదని చంద్రబాబు బాధపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ఎక్కడ బయటపడతాయోనని తర్జన భర్జనపడుతున్నారన్నారు. గతంలో చింతమనేని ప్రభాకర్ తహసీల్దారును అడ్డుకుంటే కేసు పెట్టలేదని, నాగార్జున యూనివర్సిటీలో రితిషేశ్వరి అనే విద్యార్థిని వేధిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుంటే చర్యలు లేవు అన్నారు. అప్పటి మంత్రి నారాయణ కాలేజీలో విద్యార్థుల మరణాలపై కేసులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, కమిట్ అవ్వాలి అని ఓ ఎమ్మెల్యే అంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్‌ను టార్గెట్
ఒక వైపు టీడీపీ నేతలను టార్గెట్ చేసిన రోజా, అనంతరం జనసేన నేత పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేశారు. రెండుచోట్ల ఓడిపోయిన ఓ నాయకుడు.. రేప్ చేసినవాళ్లను ఉరి తీయడం ఏంటి.. రెండు దెబ్బలు కొడితే చాలన్నారని.. గతంలో ఏం జరిగిందని రివాల్వర్‌తో రోడ్డుపైకి వచ్చారో చెప్పాలని అన్నారు. తన అక్కను అవమానిస్తే చంపాలని ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నామని.. మరి అలాంటప్పుడు అత్యాచారాలకు పాల్పడితే రెండు బెత్తం దెబ్బలా అంటూ రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగితే ఇలానే మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో ఉన్న వాళ్ల ఎమ్మెల్యే ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాను అని అన్నారు.