చంద్రబాబు ఆరాటం దేని కోసం..?
By సుభాష్ Published on 12 Jan 2020 7:29 AM GMT
అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలించవద్దని అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలంటూ రాజధాని పది గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 20 రోజులు దాటినా ఆ ఆందోళనలో కేవలం పది గ్రామాల పరిధిని దాటడం లేదు. చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగి ఉద్యమానికి చందాలు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టినా పొలికేకలు అమరావతి పొలిమేరలు దాటం లేదు. రెండు పత్రికలు, అరడజను ఛానెళ్లు నిర్విరామంగా శంఖం ఊదుతున్నా ప్రజల నుంచి ప్రతి స్పందనలేదు. ప్రధాని, రాష్ట్రపతి పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన ఘనత తనదని చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు పది గ్రామాల ధర్నాకు పెద్దమనిషిగా మారిపోయారు.
తెలంగాణలో చాపచూట్టేసిన సైకిల్ పార్టీ:
2014లో టీడీపీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మహానాడులో టీడీపీని పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటకకు కూడా విస్తరించాలని సామ్రాజ్య విస్తరణ ఆకాంక్షను ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆ తరువాత భర్మాసుర బ్రదర్‌లా పార్టీని పతనంవైపు నడిపించారు. రాజ్యాన్ని విస్తరించేందుకు తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోవడంతో ఆ రాష్ట్రంలో టీడీపీ చాపచుట్టేయాల్సి వచ్చింది.
ఆరాటం దేని కోసం..
మొన్నటి ఎన్నికల్లో సీమలో ముగ్గురు, ఉత్తరాంధ్రలో పలువురు మాత్రమే టీడీపీ తరుపున గెలిచారు. సొంత కుమారుడు అమరావతి ప్రాంతంలోనే ఓటమితో బోణీ కొట్టారు. అయినా సరే బాబు మారుతున్నట్టు లేదు. ఆయన టీడీపీ కోసం రాజకీయం చేస్తున్నారా..? లేదా వ్యక్తిగత అవసరం కోసం ఆరాటపడుతున్నారా..? అన్న అనుమానం ఇప్పుడు రాకమానదు. అమరావతిపై బాబుకు కేవలం మమకారం మాత్రమే ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి జరుగుతున్న నష్టం దృష్ట్యా ఆ మమకారాన్ని ఎప్పుడో చంపేసుకునేవారు.
కానీ, సొంత కుమారుడిని ఓడించిన అమరావతి ప్రాంతం కోసం ఆయన అన్ని త్యాగాలకు సిద్ధపడుతున్నారంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. అమరావతికి ప్రజల మద్దతు లేదు అన్నది చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే రాజధాని కోసం బంద్‌కు పిలుపుకు కూడా కేవలం 29 గ్రామాలకే పరిమితమైంది. అమరావతి ఏపీ గుండెకాయ, తలకాయ అని చెప్పే చంద్రబాబు ఆ అమరావతి కోసం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు కూడా ఇప్పటికీ పిలుపునివ్వకపోవడం గమనించదగ్గ అంశం.
ఎన్నికల ముందే టీడీపీకి చాలా మంది హెచ్చరిక:
కేవలం రాజధాని గ్రామాల్లో మాత్రమే బంద్‌కు పిలుపునివ్వడం ద్వారా అమరావతి అన్నది కొన్ని గ్రామాల సమస్యే కానీ.. రాష్ట్ర సమస్య కాదు అని ఆమోదించినట్లయింది. అన్నీ అమరావతికే అన్న చంద్రబాబు ధోరణి వల్ల టీడీపీ ఇతర ప్రాంతాల్లో ఘోరంగా దెబ్బ తింటోందని ఎన్నికల ముందే చాలా మంది హెచ్చరించారు. కానీ, చంద్రబాబు వినలేదు. ఇప్పుడు వింటున్నట్టు కూడా లేదు. అంటే రాజకీయం, పార్టీ ప్రయోజనంకటే అత్యంత విలువైన ప్రయోజనాలు అమరావతిలో చంద్రబాబుకు ఏవో దాగి ఉన్నాయన్న భావన ఇప్పుడు ప్రజల్లో ఏర్పడుతోంది.
ఉద్యమానికి ఊపురాక.. విద్యార్థులను రంగంలోకి..
ఓ ప్రముఖ దినపత్రిక ఇటీవల ఏకంగా విశాఖ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు దూరమవుతుంది. అక్కడ పరిపాలనా రాజధాని వద్దు అంటూ బహిరంగంగానే గళమెత్తింది. అంటే ఉత్తరాంధ్రలో టీడీపీ ఏమైపోయినా పర్వాలేదు. డోంట్ కేర్.. వీ వాంట్ అమరావతి అని టీడీపీ అధికార గెజిట్ ప్రకటించినట్లు అయింది. 20 రోజులైనా ఉద్యమానికి ఊపురాలేదని నిర్ధారించుకున్న చంద్రబాబు విద్యార్థులు కూడా రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. అలా పిలుపునిచ్చిన 24 గంటల్లోనే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగింది.
ఆ దాడిలో పోలీసులను కొట్టిన కుర్రాడు ఒక ప్రముఖ కళాశాల స్టూడెంట్ అని చెబుతున్నారు. అంటే చంద్రబాబు పిలుపు ఆయన మద్దతు దారులైన విద్యార్థులకు దాడులు చేయండి అన్నట్లుగా వినిపించిందేమో అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు రాజకీయం పార్టీ కోసం చేస్తున్నారా..? లేక ఆయన స్వార్ధం కోసం చేస్తున్నారా..? అన్నది ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఇప్పుడిప్పుడే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
తెలంగాణలో టీపీపీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణం..
తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన దొడ్డిదారి సామ్రాజ్య విస్తరణ ఎత్తుగడే కారణమన్నది అందరికి తెలుసు. ఇప్పుడు అమరావతిని మాత్రమే పట్టుకుని తమ అధినేత వేలాడితే తమ ప్రాంత ప్రజలు తమను రాజకీయంగా ఎలా ఆదరిస్తారు..? అన్న అనుమానం రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతల్లో మొదలవుతుంది.
రాజకీయంగా అపారనష్టం తప్పదని తెలిసినా ఒకప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు పది గ్రామాల పెద్ద మనిషిగా ఎందుకు తనను తాను సరిపుచ్చుకుంటున్నారు అన్నది ఆలోచించాల్సిన విషయం. పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు వారు కూడా మద్దతు ఇవ్వకపోయినా.. పది గ్రామాలను, పలు మీడియా సంస్థలను వెంటేసుకుని చంద్రబాబు అమరావతి అంటూ ఇంతగా ఎందుకు ఆయాసపడుతున్నారో కూడా గమనించాలి.