రూ.45 లక్షల వివాదం.. పోలీస్‌స్టేషన్‌కు యాంకర్‌ రవి

By అంజి  Published on  10 Feb 2020 11:28 AM IST
రూ.45 లక్షల వివాదం.. పోలీస్‌స్టేషన్‌కు యాంకర్‌ రవి

హైదరాబాద్‌: ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్‌పై ప్రముఖ టాలీవుడ్‌ యాంకర్‌ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. సందీప్‌ అనే వ్యక్తి ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో తన దగ్గర నుంచి రూ.45 లక్షలు అప్పుగా తీసుకొని మోసం చేశాడంటూ తన ఫిర్యాదులో రవి పేర్కొన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత తీసుకున్న రూ.45 లక్షల్లో కొంత డబ్బును తిరిగి ఇచ్చాడని, మిగతా డబ్బును అడిగితే బెరింపులకు గురి చేస్తున్నాడని యాంకర్‌ రవి తెలిపాడు. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని రవి తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు. అయితే సందీప్‌ చాలా మంది దగ్గర ఇలాగే డబ్బులు తీసుకొని మోసం చేశాడని రవి తెలిపాడు. అతడిని నుంచి తనకు రావాల్సిన మిగతా డబ్బులను ఇప్పించాలని, అలాగే అతడి నుంచి రక్షణ కల్పించాలని రవి ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

2017లో యాంకర్‌ రవి హీరోగా 'ఇది మా ప్రేమ కథ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు సందీప్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అయితే ఆ సినిమా ప్లాప్‌ కావడంతో.. రవి, సందీప్‌ మధ్య వివాదం మొదలైంది. 2018లో గుడ్‌విల్‌ కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ యాంకర్‌ రవి వేధిస్తున్నాడంటూ సందీప్‌ ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఈ ఆరోపణలు రవి ఖండించారు. ఇప్పుడు సందీప్‌పై రవి ఫిర్యాదు చేయడంతో మళ్లీ వివాదం మొదలైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story