యాంకర్ అనసూయకు వేధింపులు..
By అంజి
ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువయ్యాయి. కొందరు ఆకతాయిలు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఆమె ఫొటోలపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. సహనం కోల్పోయిన యాంకర్ అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై చేస్తున్న అసభ్యకర వాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనసూయ తన ఫిర్యాదులో పేర్కొంది. అనసూయ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇందుకు అనసూయ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ మంచి పని చేశారంటూ అనసూయకు మద్దతు తెలుపుతున్నారు.
'యాక్టర్స్ మసాలా' అనే ఓ ట్విట్టర్ అకౌంట్‌లో యాంకర్ అనసూయపై బ్యాడ్ కామెంట్ చేశారని సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కెవీఎం ప్రసాద్ తెలిపారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సెలబ్రెటీలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఏసీపీ తెలిపారు.