మహాత్మా గాంధీ.. అహింసా వాదంతో భారత్ కు స్వాతంత్య్రాన్ని తీసుకొని వచ్చిన మహోన్నత నేత..! భారత జాతిపిత అయిన గాంధీజీపై కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపి అనంత్ కుమార్ హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ ఆధ్వర్యంలో అప్పట్లో నడిచిన స్వాతంత్య్ర ఉద్యమం ఒక పెద్ద డ్రామా అని అనంత్ హెగ్డే వ్యాఖ్యానించారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ గాంధీది అసలైన పోరాటం కాదని.. సర్దుబాటు స్వాతంత్య్ర పోరాటమన్నారు. గాంధీకి బ్రిటీషర్ల మద్దతు కూడా ఉందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే గొప్ప నేతలు అని చెప్పుకుంటూ ఉన్నామో వాళ్ళెవరూ పోలీసులతో లాఠీ దెబ్బలు తినలేదని.. వారిదంతా పెద్ద నటన అని అన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమం మొత్తం బ్రిటిష్ వారి సమ్మతి మరియు మద్దతుతో ఆడిన పెద్ద నాటకం అని అన్నారు. నాయకులు అని పిలవబడే వీరు చేసింది నిజమైన పోరాటం కాదని వ్యాఖ్యలు చేశారు. ఉపవాసం , సత్యాగ్రహం వల్ల దేశానికి స్వాతంత్ర్యం లభించిందని ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, అయితే ఇది నిజం కాదని ఆయన అన్నారు. బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్ళింది సత్యాగ్రహం వల్ల కాదని అన్నారు. బ్రిటీషర్లు ఫ్రస్ట్రేషన్ తో భారత్ కు స్వాతంత్య్రం ఇచ్చారని ఆయన అన్నారు. ఈ నాయకులు తాము సర్వస్వం దేశానికి ధారపోశామని చెప్పుకున్నారని.. కానీ వారు చేసింది ఏమీ లేదని ఒక్క డ్రామా మాత్రమేనని ఆయన అన్నారు. చరిత్ర చదివితే తన రక్తం మరిగిపోతుందని.. డ్రామాలు ఆడిన వ్యక్తులు ఇప్పుడు మహాత్ములు అయ్యారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే నిజంగా స్వాతంత్య్రం కోసం పోరాడారో వారు మాత్రం చరిత్రలో కనుమరుగయ్యారని అనంత్ హెగ్డే బాధను వ్యక్తం చేశారు. ఎవరైతే బ్రిటీషర్లతో అప్పుడు కుమ్మక్కయ్యారో వారు గొప్ప దేశభక్తులుగా చరిత్రలోకి ఎక్కారని ఆయన అన్నారు.

అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు, గాంధేయవాదులు ఫైర్ అయ్యారు. మహాత్ముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అనంత్ కుమార్ హెగ్డేపై బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై మోదీ కూడా బాధపడ్డారని తెలుస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.