కేంద్ర ప్రభుత్వంపై కోపమా.. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2020 11:30 AM GMT
కేంద్ర ప్రభుత్వంపై కోపమా.. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం నాడు అధికారిక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినందుకు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇండియా తెలిపింది.

దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామని సంస్థ చెబుతోంది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని సంస్థ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే..!

2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని.. అందువల్లనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపణలు చేసింది.

మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని చెబుతోంది సంస్థ. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Next Story