తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్న బిగ్ బీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 July 2020 4:29 PM GMT
తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్న బిగ్ బీ..!

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. జులై 23న ఆయనకు ఆసుపత్రి వైద్యులు కరోనా టెస్ట్ చేయగా.. నెగటివ్ వచ్చిందని ఆయనను త్వరలోనే డిశ్చార్జ్ చేయబోతున్నారని కథనాలు వైరల్ చేశారు. చాలా మంది నిజమేననుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

ఈ వార్తలను అమితాబ్ ఖండిస్తూ ట్వీట్ చేశారు. తాను కోలుకున్నాననే వార్తలో నిజం లేదని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా తప్పుడు వార్తను ప్రసారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఈ వార్త అబద్ధం, బాధ్యతా రాహిత్యంతో కూడుకున్నది.. తప్పుడు కథనాలు అని చెప్పారు.

అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్ గా ఉంటారు. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని కూడా ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 12న అమితాబ్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య లకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అమితాబ్ భార్య జయా బచ్చన్ కు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది.

అమితాబ్ ప్రస్తుతం కోవిద్-19 ట్రీట్మెంట్ ను తీసుకుంటూ ఉన్నారు. ఆయన తన అభినానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోవిద్ వార్డులో ఉంటున్న బిగ్ బీ ప్రతిరోజూ తన బ్లాగ్ ను రాస్తూనే ఉన్నారు.

Next Story