మోదీ 1.0 లో జాతీయ భద్రతా సలహాదారు అన్ని విషయాల్లోనూ అత్యంత కీలకవ్యక్తిగా నిలిచారు. ఆయనకు తెలియకుండా ఏమీ జరిగేది కాదు. అన్ని మంత్రిత్వ శాఖలు ఆయన కనుసన్నల్లో ఉండేవి. ఆయన విదేశాంగ విధానం వంటి విషయాల్లోనూ కల్పించుకునేవారు. చాలా సందర్భాల్లో వారు తీసుకున్న నిర్ణయాలను ఆయన తిరగవ్రాసేవారు. పైగా ప్రధానమంత్రితో ఆయనకు ఉన్న సంబంధాల కారణంగా అన్ని విషయాల్లోనూ ఆయన మాటే చెల్లుబాటయ్యేది.

అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రెండోసారి మోదీ ప్రధాని అయిన తరువాత అమిత్ షా హోం మంత్రి అయ్యారు. ఆయన పార్టీ అద్యక్షులు కూడా కావడంతో, చాలా విషయాలలో ఆయన మాట చెల్లుబాటు అవుతోంది. దోవల్ ప్రాముఖ్యం కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఉదాహరణకు ఇటీవల కశ్మీర్ లోయలో పదిహేను దేశాల దౌత్యాధికారుల పర్యటనకు సంబంధించిన వ్యవహారాన్ని దోవల్ ప్లాన్ చేసినా, అమలు చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖే. విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హోం శాఖ ఆధ్వర్యంలోనే పనిచేసింది. కశ్మీర్ విషయంలో కొన్నిమానవ హక్కుల ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ శాఖ భయపడ్డా, అమిత్ షా దానిని పట్టించుకోలేదు. కొందరు దౌత్యాధికారులు ఆయన అపాయింట్ మెంట్ కోరినా ఆయన దానిని తిరస్కరించారు.

అయితే ఒక దేశానికి చెందిన అధికారికి మాత్రం అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వాలని అనుకున్నారట. కానీ విదేశాంగశాఖ మాత్రం ఈ సమావేశాన్ని చేపట్టవద్దని షాకి సూచించిందట. ఎందుకంటే ఒక దేశానికి అపాయింట్ మెంట్ ఇచ్చి, మిగతా దేశాలకు ఇవ్వకపోతే అనవసర సమస్యలు తలెత్తుతాయని అమిత్ షా కి చెప్పిందట. దాంతో అమిత్ షా వెనక్కి తగ్గారట. అంటే అన్నిటా ఆధిపత్యం ఉన్నా, అమిత్ షా అవసరమైన చోట తగ్గుతున్నారు. అది చాలా మంచిదని విదేశాంగ శాఖ మెచ్చుకుంటోందట.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.