సీఏఏ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మంగళవారం లక్నోలో సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సభలో అమిత్ ప్రసంగించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలతో చర్చనీయాంశంగా మారిన సీఏఏ అమలుపై ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. దేశాన్ని ముక్కలు చేయమని చెప్తున్న ‘టుకడే టుకడే’ గ్యాంగ్ కు కాంగ్రెస్ మద్దతిస్తోందని అమిత్ షా విమర్శలు చేశారు. ఇండియాకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వారి మిగతా జీవితమంతా జైలులోనే గడపాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒకే స్వరంతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా స్పష్టమైన కుట్ర జరుగుతోందని, దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్కడ చర్చ చేయాలని కోరితే అక్కడ చర్చ జరిపేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అమిత్ సవాల్ చేశారు. కొత్తచట్టంపై విపక్షాలు ఎన్ని నిరసనలు చేసినా, ఎంతగట్టిగా అరిచినా వెనక్కి తగ్గేది లేదని అమిత్ షా తేల్చేశారు.

కాగా..ఈ నెల 27వ తేదీన జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మమతా బెనర్జీ సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తారని తెలుస్తోంది. అలాగే ఈశాన్య రాష్ర్టాలతో పాటు..ఇతర రాష్ర్టాల్లో బీజేపీ మినహా అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఆయా శాసనసభల్లో సీఏఏ వ్యతిరేక తీర్మానాలు చేయాలని మమతా పిలుపునిచ్చారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.