ముఖ్యాంశాలు

  • సీక్రేట్ సిబ్బందికి 29 వారాల పాటు కఠోర శిక్షణ

  • అగ్రరాజ్య అధ్యక్షుడిపై డేగ కన్ను

  • నిరంతరం అధ్యక్షుడి వెన్నంటే..

  • ఈ ‘సీక్రెట్‌ సర్వీస్‌’ ఎవరెవరికి భద్రత కల్పిస్తుంది

అమెరికా అధ్యక్షుడికి భద్రతనిచ్చే ‘సీక్రెట్‌ సర్వీస్‌’ అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడంటే మాటలా ఏంటీ..! ఎందుకంటే కరుడుగట్టిన టెర్రరిస్టులు, నేరగాళ్లు, శతృవులు ఇలా ఎందరి చూపు ఆయనపై ఉంటుంది. ఎనీటైమ్‌ కూడా ఆయనకు అత్యంత భద్రత ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ప్రాణహాని కలుగుతుందో తెలియని పరిస్థితి. మరీ ఆయనకు బాధ్యతలు చూసేదెవరు..? వీటన్నింటిని చూసిది ‘సీక్రెట్‌ సర్వీస్‌’. ఇది అధ్యక్షుడికి ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత అనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా అమెరికా సర్వీస్‌ పనితీరు ఎలాంటి ఉంటుందన్నది అందరిలో మెదులుతున్న ఆసక్తికర అంశం. ఈ సీక్రెట్‌ సర్వీస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ అమెరికా ‘సీక్రెట్ సర్వీస్‌’ ఏర్పాటుకు 1865 ఏప్రిల్‌ 14న అప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ కార్యనిర్వాహణ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే రోజు కూడా ఆయన హత్యకు గురికావడం జరిగింది. అనంతరం జులై 5న సీక్రెట్‌ సర్వీస్‌ ఏర్పాటైంది. కానీ అధ్యక్షుల రక్షణ బాధ్యత ఈ విభాగానికి అప్పగించలేదు. ‘సివిల్‌ వార్‌’ తర్వాత ఆర్థిక వ్యవస్థలోకి భారీగా దొంగనోట్లను కట్టడి చేయడమే దీని ఏర్పాటు ఉద్దేశం 1901లో అప్పటి అధ్యక్షుడు విలియం మెక్సిన్సే హత్యతో అధ్యక్షుడి భద్రతను సీక్రెట్‌ సర్వీస్‌కు అప్పగించింది.

29 వారాల పాటు కఠోర శిక్షణ

ఈ అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌కు ఎంపికైన వారికి 29 వారాల పాటు కఠోరమైన శిక్షణ ఉంటుంది. తుపాకీ కాల్పులు, ఆత్మాహుతి బాంబర్లను, పేలుళ్లను ఎదుర్కొనే విధంగా శిక్షణ ఉంటుంది. అలాగే ఆధునాతన ఆయుధాలతో ఎదురుదాడి, అనుమానస్పద పదార్థాలను పసిగట్టడం లాంటి అంశాలలో శిక్షణ ఇస్తారు.

నిరంతరం అధ్యక్షుడి వెన్నంటే..

ఈ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజంట్లు నిరంతరం అధ్యక్షుడి వెన్నంటే ఉంటారు. వీరి సూచనలు, సలహాలు అధ్యక్షుడు తప్పనిసరిగా పాటించాల్సిందే. భద్రత నుంచి బయటకు వెళ్లే అధికారం ఉండదు. బయట ప్రయాణం చేస్తే కనుక ఆయన పర్యటనను వీడియో తీస్తారు.

అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటన సమయంలో సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు మూడు నెలల ముందే ఆ దేశానికి చేరుకుని ఏర్పాట్లను ప్రారంభిస్తారు. స్థానిక ప్రభుత్వ, పోలీసు అధికారుల సమన్వయం చేసుకుంటూ భద్రత పరంగా పరిశీలిస్తారు. విమాన మార్గంలో, రోడ్డు మార్గంలో ఎలాంటి ముప్పు తలెత్తకుండా చర్యలు చేపడతారు. బెల్జియన్‌ మాలినోయిస్‌ జాగిలాలను వెంట తెచ్చుకుని తనిఖీలు చేపడతారు. అమెరికా అధ్యక్షుడు రావడానికి  ముందు ఏడు విమానాల్లో వివిధ పరికరాలు, హెలికాప్టర్, ప్రత్యేక వాహనాలు, కమ్యూనికేషన్‌ పరికరాలు సదరు దేశానికి చేరుకుంటాయి. వంట చేసేవారు కూడా అక్కడే బస చేస్తారు. అధ్యక్షుడు బస చేసే హోటల్‌కు ఎవ్వరికి అనుమతించరు. అధ్యక్షుడు ఉన్నన్నీ రోజులు హోటల్‌ నిఘా నీడలో ఉంటుంది. అధ్యక్షుడు ఉండే కిటికీలకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ ప్లాస్టిక్‌ వంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు.

ఈ సీక్రెట్‌ సర్వీస్‌ ఎవరెవరికి భద్రత కల్పిస్తుంది

ఈ సీక్రెట్ సర్వీస్‌ అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యక్షుడు అలాగే వారి కుటుంబ సభ్యులు భద్రత కల్పిస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే ముఖ్య అభ్యర్థులకు, అమెరికాలో పర్యటించే ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులకు ఈ భద్రత ఉంటుంది.

భద్రత విభాగంలో ఎంత మంది సిబ్బంది..

ఈ భద్రత విభాగంలో చాలా మంది సిబ్బంది ఉంటారు. మొత్తం 6500 మంది అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఉంటారు. ఇందులో 3,200 మంది స్పెషల్‌ ఏజంట్లు, 1300 యూనిఫామ్‌ డివిజన్‌ అధికారులు, 2వేల మంది సాంకేతిక, సహాయ సిబ్బంది ఉంటారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.