'డెలివరీ చెయ్యి.. పౌరసత్వం ఇయ్యి' కి ఇక చెల్లుచీటీ

By రాణి  Published on  24 Jan 2020 5:29 AM GMT
డెలివరీ చెయ్యి.. పౌరసత్వం ఇయ్యి కి ఇక చెల్లుచీటీ

మన దేశంలో పౌరసత్వం, ఎన్నార్సీ వివాదం చెలరేగుతున్న సమయంలోనే తమ దేశంలోని వలసలను నిరోధించేందుకు అమెరికా సంసిద్ధం అవుతోంది. అమెరికాలో పుట్టిన వారందరికీ అమెరికన్ పౌరసత్వం అభిస్తుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు చాలా మంది గర్భవతులు అమెరికాకు వెళ్లి కానుపు చేయించుకుంటున్నారు. బర్త్ సర్టిఫికేట్లు పొందుతున్నారు. పది పదిహేనేళ్ల తరువాత ఆ కాగితం పుచ్చుకుని వచ్చి దబాయించి మరీ పౌరసత్వం పొందేస్తున్నారు. ఇలాంటి వారిని బర్త్ టూరిస్టులు అని, ఈ ప్రక్రియను బర్త్ టూరిజం అని ముద్దుగా పిలుస్తూంటారు. ఇప్పుడు అమెరికా ఈ బర్త్ టూరిజంను నిరోధించేందుకు గాను కొత్త వీసా నిబంధనలను అమలులోకి తెచ్చింది.

ఈ నిబంధనల ప్రకారం పౌరసత్వం కోసమే అమెరికాలో బిడ్డలకు జన్మనిచ్చేందుకు వస్తున్నారని అమెరికన్ వీసా అధికారులు నిర్ధారిస్తే తల్లిదండ్రుల వీసా అప్లికేషన్లను తిరస్కరించవచ్చు. అయితే, అమెరికాకు వైద్య చికిత్సకు వస్తున్నారా? లేక పౌరసత్వం కోసమే అమెరికాలో పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నారా? అనేది నిర్ధారించడం కీలకంగా మారింది. తాము కేవలం వైద్య చికిత్స కోసమే వస్తున్నామని, తమ వద్ద అందుకు తగినంతగా డబ్బు ఉందని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుట్టుకతో పౌరసత్వం కల్పించే నిబంధనను తొలి నుంచీ వ్యతిరేకించడమే కాదు, దానిని తొలగిస్తామని కూడా చెబుతూ వచ్చారు. అసలు గర్భిణులకు టూరిస్ట్ వీసా ఇవ్వకూడదని ఆయన ప్రతిపాదించారు. కానీ అప్పట్లో ఇది సాధ్యం కాదని నిలుపు చేశారు.

మరో వైపు అమెరికాలో బర్త్ టూరిజం కాసుల వర్షం కురిపించే వ్యాపారం. కొన్ని కంపెనీలు ఈ వ్యాపారం దండిగా చేస్తూంటాయి. అమెరికాకు వెళ్లడం, అక్కడ డెలివరీ చేయించుకుని, బర్త్ సర్టిఫికేట్ తీసుకునేందుకు దాదాపు 80 వేల డాలర్ల వరకూ ఈ సంస్థలు వసూలు చేస్తాయి. ఇలాంటి సంస్థలు పలు అర్ధిక అక్రమాలకు, అవకతవకలకు పాల్పడుతుంటాయని కూడా ఆరోపణలున్నాయి. అమెరికాలో ఇలాంటి చాలా మంది ఏజెంట్లు, సంస్థలపై కేసులు నడుస్తున్నాయి కూడా. తమ సంతానానికి అమెరికన్ పౌరసత్వం పొందేందుకు చైనా, రష్యాల నుంచి చాలా మంది ఇదే పద్ధతిలో వస్తూంటారు. ప్రతి ఏటా దాదాపు 35 వేల మంది ఈ విధంగా అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తరువాత సొంత దేశాలకు వెళ్తూంటారు.

Next Story