భారత్‌కు ట్రంప్ రాక..
By అంజి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా మన దేశంలో పర్యటించనున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో భార్య మెలానియాతో కలిసి ఆయన దిల్లీ, అహ్మదాబాద్‌లలో పర్యటిస్తారు. ఉభయ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు వీరి పర్యటన దోహదపడుతుందని వైట్ హౌస్ ప్రకటించింది. భారత్‌కు సుమారు రూ.13,543 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టంను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా హోంశాఖ సోమవారం అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ పర్యటన ఖరారు కావడం విశేషం.
గత సెప్టెంబర్ నెలలో హౌస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ కార్యక్రమం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ తో వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ.. ట్రంప్.. ఆయన ఫ్యామిలీని భారత్ లో పర్యటించాలని ఆహ్వానించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నట్టు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.
దౌత్యపరమైన మార్గాల్లో భారత్, అమెరికా మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ఈ ఏడాది జనవరిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. మొత్తానికి ఇప్పటివరకూ వాణిజ్య అంశాల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలను ఈ పర్యటన ద్వారా తొలిగిపోతాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు ఈ నేపథ్యంలో భారత రక్షణావసరాలకు సంబంధించి భారత ప్రభుత్వం అమెరికాతో ఓ మెగా డీల్ కుదుర్చుకోనుందని తెలుస్తోంది.. రక్షణ అవసరాలకై ఇప్పటివరకూ రష్యాపై ఆధారపడుతూ వచ్చిన భారత్.. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికావైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.