అరటిపండు తింటే తప్పా..?
By అంజి Published on 9 Dec 2019 8:35 AM ISTఅరటి పండు ఆరోగ్యానికి మంచిది. పెద్ద ఖరీదైనది కూడా కాదు. ఎవరైనా తినొచ్చు కదా అని అనుకున్నాడు డేవిడ్ డటునా అనే వ్యక్తి. చక్కగా తినేసాడు.. అంతే ఒక్కసారిగా జనం షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ అరటిపండు ఎక్కడుందో తెలుసా అమెరికాలోని మియామీ బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో. అమెరికాలో అరటిపండు కాబట్టీ ఖరీదు పెరగలేదు ఇది ఒక కళా కారుడి అద్భుత సృష్టి. ఇటీవల మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలో ఈ అరటి పండు విశేషంగా ఆకట్టుకుంది. అరటి పండును టేపుతో గోడకు అతికించి దాని ధర రూ.85 లక్షలుగా ప్రకటించడం విశేషం. ఇది ఒక కళ అని చెబుతున్న ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్, ఈ ఆర్ట్ కి కమెడియన్ అని పేరు పెట్టాడు. అతను మొత్తం మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా రెండు ఇప్పటికే అమ్ముడుపోయాయి. అలా అని ఇవి ప్రత్యేమైనవి ఏమి కాదు. అరటి పండు, టేపు కావాలంటే మనకు సాధారణ దుకాణాల్లో కూడా దొరుకుతాయి. అలాంటిది ఇంత డబ్బులు పోసి దాన్ని కొనుగోలు చేయాలా అని అనుకోకండి..ఇలా ఆర్ట్ గ్యాలరీలో.. పేరొందిన కళాకారుల ఆర్ట్స్ మధ్య ఠివీగా కొలువుదీరే అవకాశం అన్ని అరటిపళ్లకీ రాదు కదా. .
పైగా దీనికి సర్టిఫికెట్ హక్కులు కూడా కల్పిస్తున్నారు. లక్షలు వెచ్చించి ఈ అరటిపండును కొనలేనివాళ్ళు దీనితో ఫోటోలు తీసుకొని ఆనందించారు. ఇక ఈ అరటి పండు చిత్రాన్ని ఆర్ట్ బాసెల్ మియామీ బీచ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. అయితే ఇప్పుడు డేవిడ్ డటునా అనే ఓ కళాకారుడు అక్కడికొచ్చాడు. గబుక్కున గోడకు అతికించిన ఆ అరటిపండును తీసుకొని ఎంచక్కా ఆరగించాడు. డేవిడ్ చేష్టకు అక్కడి నిర్వాహకులు షాక్ అయితే, చూసేందుకు వచ్చిన ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే, డేవిడ్‌పై నిర్వాహకులు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. కాకపోతే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అతడిని ఆదేశించారట.