అగ్రరాజ్యంలో కరోనా బీభత్సం.. 24గంటల్లోనే..
By న్యూస్‌మీటర్ తెలుగు
కరోనా కాటుకు అమెరికా కుదేలవుతుంది. బాధితుల, మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లోనే 2,494 మంది ప్రాణాలు కోల్పోయారంటే అగ్రరాజ్యంలో మహమ్మారి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 53,928మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక దేశంలో కేసుల సంఖ్య 9,56,375కి చేరిందని జాన్స్ హోప్కిన్ విశ్వవిద్యాలయం తెలిపింది.
దీంతో అమెరికాలో కరోనా కేసులు, మృతుల సంఖ్య ఏ దేశంలో లేనంత అధికంగా ఉంది. శుక్రవారం నాడు 1,258 మంది ప్రాణాలు కోల్పోగా.. గడిచిన మూడు వారాల్లో శుక్రవారం నమోదయినవే అత్యల్ప మరణాల సంఖ్యగా ఉంది. అయితే ఒక్కసారిగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.