అంబులెన్స్‌లో కరోనా రోగి మృతి.. డ్రైవర్‌పై దాడి (వీడియో వైరల్‌..)

By సుభాష్  Published on  31 July 2020 11:58 AM GMT
అంబులెన్స్‌లో కరోనా రోగి మృతి.. డ్రైవర్‌పై దాడి (వీడియో వైరల్‌..)

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రాణాలను సైతం లెక్కడ చేయకుండా వైద్య సిబ్బంది సేవలందిస్తుండగా, కొందరువారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో అలాంటి ఘటననే చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో కరోనా రోగి మృతి చెందడంతో డ్రైవర్‌పై దాడికి దిగారు.

75 ఏళ్ల కరోనా రోగిని ఆస్పత్రికి తరలించేందుకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో రోగిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే బెడ్లు ఖాళీగా లేకపోవడంతో ఆ రోగిని అక్కడ ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో అంబులెన్స్‌లో ఉన్న రోగి మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు డ్రైవర్‌పై దాడికి దిగారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ కిట్‌ ఎందుకు పెట్టుకోలేదంటూ దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వైపు ఈ ఘటనపై డ్రైవర్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. నిన్న ఒక్క రోజే 55,079 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మరింత భయాందోళన పుట్టిస్తోంది. అలాగే 779 మంది మృతి చెందారు. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత దేశంలో ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే.ఇప్పటి వరకు భారత్‌లో 16,38,871 పాజిటివ్‌ కేసులకు చేరుకుంది.

ఇప్పటి వరకు 10,57,806 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,45,318 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. 46లక్షల కేసులతో అమెరికా, 26లక్షల కేసులతో బ్రెజిల్‌ లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి



Next Story