చెన్నైకి షాక్.. మరో రెండ్ మ్యాచ్‌లకు రాయుడు దూరం.!
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2020 7:27 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు అంబటి రాయుడు మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఓ మ్యాచ్ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయుడి బ్యాటింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అయితే రాయుడు మళ్లీ టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదన్నాడు.
తొడకండరాలు పట్టేయడంతో రాజస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రాయుడు బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో చెన్నై రుతురాత్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో రాయుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. రాయుడు ఉండి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాయుడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా.. మరో రెండు మ్యాచ్‌లకు రాయుడు విశాంత్రి నివ్వాలని వైద్యులు సూచించారట. దీంతో మరో రెండు మ్యాచ్‌ల వరకు రాయుడు అందుబాటులో ఉండడని చెన్నై జట్టు అధికారి ఒకరు తెలిపారు.
భారత్ తరఫున రాయుడు 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. ఇక 148 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో అంబటి రాయుడు 602 పరుగులు సాధించి చెన్నై విజేతగా నిలవటంలో కీలకపాత్ర పోషించాడు. కాగా..2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. విజయ్ శంకర్‌కు జట్టులో స్థానం దక్కింది. ఆ తర్వాత విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన తెలుగు తేజం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.