దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులేంటి..?

By Newsmeter.Network  Published on  30 Dec 2019 5:32 AM GMT
దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులేంటి..?

గుంటూరు: అమరావతిలో రైతుల అరెస్ట్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో రైతుల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలని చంద్రబాబు అన్నారు. భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్న వాళ్లపై పోలీసు కేసులా..? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు. నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయమైన చర్య అని అన్నారు. దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులేంటని చంద్రబాబు ప్రశ్నించారు. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా?, రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Amaravati Raitu Protest

అర్థరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులు అరెస్ట్‌ చేసి మహిళలను, వృద్ధులను భయబ్రాంతులకు గురి చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు త్యాగం చేసిన రైతులపై ఇంత అమానుష చర్యలు సరికావని చంద్రబాబు పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్ట్‌లని ఎలా అంటారన్నారు. 13 రోజులుగా వేలాది మంది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతుల అరెస్ట్‌ అప్రజాస్వామికమని చంద్రబాబు అన్నారు. వేలాది మంది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచివేయలేరని చంద్రబాబు పేర్కొన్నారు.

మూడు రాజధానుల అంశంపై అమరావతిలో రైతుల ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నాయి. గత 13 రోజులుగా రాజధానిని తరలించవద్దని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలో ఆందోళన చేసిన రైతులు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధుమవుతున్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర రాజధాని తరలింపుపై రైతులు వివరించే అవకాశాలు కనిపిస్తన్నాయి.

Next Story