మేం చనిపోతాం.. అనుమతి ఇవ్వండి..!

By అంజి  Published on  1 Jan 2020 4:25 PM IST
మేం చనిపోతాం.. అనుమతి ఇవ్వండి..!

అమరావతి: చనిపోయేందుకు.. అనుమతి ఇవ్వాలి అంటూ రాజధాని అమరావతి రైతులు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు లేఖ రాశారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో మాట త‌ప్ప‌ను.. మ‌డ‌మ తిప్ప‌ను అంటూ విన‌సొంపు మాట‌లు చెప్పాడని.. తీరా ఆయ‌న‌కు అధికారం క‌ట్ట‌బెడితే గెలిపించిన మ‌మ్మ‌ల్నే రోడ్డున ప‌డేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ మాట‌లు న‌మ్మి నిలువెత్తునా మోస‌పోయమని రైతులు అంటున్నారు. సీఎం జగన్‌ తీరుతో తమ జీవితాల‌పై మాకే విర‌క్తి పుడుతోందంటున్నారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో తామంతా ఉన్న‌ప‌లంగా రోడ్డున ప‌డ్డామ‌ని, దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న త‌మ‌ను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వ‌మే ప‌ట్టించుకోవ‌డం లేదని రైతులు వాపోయారు. అమ‌రావ‌తి నుంచి రాజధాని తరలిపోతే తామంతా జీవచ్ఛవాలుగా మిగిలిపోతామ‌ని వారు ఆక్రంద‌న చెందుతున్నారు. ఇక మాకు మరణమే శరణ్యం క‌నుక మాయందు దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాల‌ని రాజధాని రైతులు రాష్ట్ర‌ప‌తి కోవింద్‌కు లేఖ రాశారు.

రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం కోసం తామంతా ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూమిని ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి అప్పగించామని రైతులు లేఖలో పేర్కొన్నారు. 2014 సెప్టెంబర్‌లో శాసనసభలో అమరావతిని రాజధానిగా చేస్తూ అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమరావతి నిర్మాణానికి తమ పొలాలను ప్రభుత్వానికి ఆనందంగా అందించామని రైతులు లేఖలో తెలిపారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌ రాజధానికి భూములిచ్చిన రైతులను అభినందించారు, అమరావతే రాజధాని అని మాటిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారని లేఖలో రైతులు తమ గొడును వెళ్లబోసుకున్నారు.

కేవలం సీఎం జగన్‌, పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని, పైగా అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారని రైతులు లేఖలో తమ ఆక్రందనను చెప్పుకున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు రాజధాని స్మశానం అని, ఎడారి అని ఇంకొకరు, ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లని మరొకరు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రైతులు లేఖలో తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story