అమరావతి రాజధాని రైతులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఎవ్వరికీ అన్యాయం చేయడం లేదని.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అమరావతిలోనే లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు తండ్రిలా ఆలోచన చేయాల్సి ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. అమరావతి అన్నది ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరు కాదని, అమరావతిలో ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీ, పైపు లైన్లు లేవన్నారు. కనీస మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చ చేయాలన్నారు. దీనికోసం లక్ష కోట్లపైనే ఖర్చు చేయాలని గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లే లెక్కగట్టారని సీఎం జగన్‌ తెలిపారు.

మొత్తంగా గత ఐదేళ్లలో అమరావతి మీద ఖర్చు చేసింది కేవలం రూ.5,674 కోట్లు మాత్రమేనని, ఇంకా రూ.2,297 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రూ.లక్ష కోట్లు అవసరమైన చోట రూ.6 వేల కోట్లు పెడితే సముద్రంలో నీటి బొట్టేనని సీఎం జగన్‌ అన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ పరిస్థితి ఎంటి అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం మన పిల్లలు, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు పోవాల్సి వస్తుందన్నారు. అదే ఖర్చులో 10 శాతం విశాఖ మీద పెడితే బాగా డెవలప్‌ అవుతుందని, ఇప్పటికే విశాఖ రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ నగరంగా ఉందని సీఎం జగన్‌ అన్నారు. కనీసం వచ్చే కాలంలో అయినా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

ఇదే తాడేపల్లి, మంగళగిరిని మోడల్‌ మున్సిపాల్టీలుగా చేయడానికి రూ.1100 కోట్ల ఖర్చవుతుందని, ఇలాంటి వాటిని వదిలిపెట్టి, ఎంతపెట్టినా కనిపించని చోట రూ.లక్ష కోట్లు పెడితే ఏం ఉపయోగం ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. అయినా సరే ఎవ్వరికీ అన్యాయం జరగకుండా ఇక్కడే లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ కంటిన్యూ చేస్తామని చెప్పామన్నారు. కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌, విశాఖలో కార్యనిర్వహక క్యాపిటల్‌ పెడతామన్నారు. ఇవాళా తన ముందు రాజధాని రైతులు పెట్టిన అంశాలన్నీ కూడా నెరవేర్చడం ప్రభుత్వం కనీస బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రోడ్లను డెవలప్‌ చేస్తే.. రేపు ధరలు పెరిగాక రైతులే అమ్ముకుంటారు, లేదా వ్యవసాయం చేసుకుంటారని, అది వారి ఇష్టమని సీఎం జగన్‌ అన్నారు.

అనంతరం సీఎం జగన్‌కు రాజధాని రైతులు తమ సమస్యలను వివరించారు. రాజధాని గ్రామాల్లో ఏం కావాలో సృష్టంగా చెప్పాలని సీఎం జగన్‌ అన్నారు. కనీసం రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో అభివృద్ధి ప్రణాళికతో పాటు, రాజధాని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. కాగా అమరావతి రాజధాని ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు సీఎం జగన్‌ కలవడం వెనుక వేరే కోణం ఉందని ప్రచారం జరుగుతోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.