చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి..!

By అంజి  Published on  28 Nov 2019 2:05 PM IST
చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి..!

ముఖ్యాంశాలు

  • ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబు రాజధాని పర్యటన
  • చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో ఆందోళనకారుల దాడి
  • చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలు
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు తన పార్టీ నేతలతో కలిసి అమరావతి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు నల్లజెండాలు ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. వెంకటపాలెం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రబాబు ఉన్న బస్సుపై కొంత మంది ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కర్రలు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్‌ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గూమిగూడారు.

చంద్రబాబు అమరావతి ప్రజలను మోసం చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బహాబహీకి దిగాయి. చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డుకున్న కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటన వెంకటాయపాలెం,ఉద్దండరాయ పాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు తదితర గ్రామాల మీదుగా సాగుతోంది. ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని పర్యటనకు రావొద్దంటూ రోడ్డు పక్కన పెద్ద ఎత్తున ప్లేక్సీలు ఏర్పాటు చేశారు.

చంద్రబాబుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఒక పక్క కొందరు చంద్రబాబుకు మద్దతు తెలుపుతుంటే.. మరోపక్క చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండంతో అమరావతిలో హైటెన్షన్‌ పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఉద్దండరాయుని పాలెంకు చేరుకున్నారు. కాగా చంద్రబాబుకు మహిళలు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశంలో.. అక్కడ ఉన్న మట్టి ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగా నమస్కారం చేసి మట్టిని ముద్దాడారు.

రాజధానిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని.. అందుకే అన్ని తాత్కాలిక కట్టడాలు కట్టారని ఉండవల్లి రైతులు ఆరోపించారు. చంద్రబాబు మా భూములు అన్యాయంగా లాక్కున్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో చంద్రబాబు రాక మాకు లాభం లేదు అంత నష్టమేనన్నారు. తాత్కాలిక కట్టడాలు అని చెప్పారు. మళ్లీ ఏ మొహం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. దళితుల భూములు కూడా వదలలేదు.. అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. మూడు పంటలు పండే పచ్చని భూములు నాశనం చేశారని, తమ గ్రామంలో ఏనాడు పర్యటించలేదన్నారు. రాజధాని ప్రాంతంలోని మూడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ చిత్తుగా ఓడిపోయిందని రైతులు తెలిపారు.

Next Story